Bharat Aawaz
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇది రానున్న 24 గంటల్లో 'ఆర్నబ్' తుపానుగా బలపడి, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చి 'అతి తీవ్ర తుపాను'గా మారే ప్రమాదముందని వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విశాఖపట్నం – మచిలీపట్నం మధ్య (కాకినాడకు సమీపంలోని యానాం వద్ద) ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా మూడ్రోజుల పాటు వానల బీభత్సం తప్పదని అధికారులు స్పష్టం చేశారు.

సోమవారం ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరగనుంది. ప్రారంభంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, తుపాను తీవ్రత పెరిగేకొద్దీ మంగళవారానికి ఏకంగా 140 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో రాకాసి అలలు 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, యానాం తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ తుపాను ధాటికి శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉమ్మడి కోస్తా జిల్లాలన్నీ జలమయం కానున్నాయి. ముఖ్యంగా ఈ నెల 27, 28 తేదీల్లో కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు (కుంభవృష్టి) కురిసే అవకాశం ఉంది. పరిస్థితి తీవ్రతను బట్టి కోస్తా జిల్లాలన్నింటికీ వాతావరణ శాఖ ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించింది.

తీరం వెంబడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కోస్తాలోని అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు. ఈ నెల 29 వరకు సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా ఉంటుందని, అలల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే ఒడ్డుకు తిరిగి రావాలని, ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ముందస్తు సహాయక చర్యల్లో నిమగ్నమైంది.
10 Views