స్థానిక ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
'చెప్పాం-చేస్తున్నాం' ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు ఆదేశం
మిత్రధర్మాన్ని తప్పకుండా పాటించాలని, ఎలాంటి వెసులుబాటు లేదని స్పష్టీకరణ
అర్హులైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ
ప్రతి బూత్లోనూ 2024 కంటే ఎక్కువ ఓట్లు పడాలని లక్ష్య నిర్దేశం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, ప్రతిఒక్కరూ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 'చెప్పాం-చేస్తున్నాం' అనే నినాదంతో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో మిత్రధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. "2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత మనం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. 151 సీట్లతో గెలిచి అరాచకాలు సృష్టించిన గొడ్డలి పార్టీని ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసి తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాం. ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నాం. ఈ మంచి పనులను ప్రజలకు వివరించాలి" అని అన్నారు.
మిత్రధర్మం పాటించాల్సిందే..
కూటమి పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో చక్కటి సమన్వయం ఉండాలని చంద్రబాబు గట్టిగా సూచించారు. "కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా నిలవాలి. మిత్రధర్మాన్ని పాటించడంలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. మూడు స్థాయిల్లోనూ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఒకే ప్రభుత్వం ఉంటే జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. వార్డు, డివిజన్ మొదలు ప్రతి స్థానంలోనూ కూటమి జెండాలు ఎగరాలి" అని ఆయన స్పష్టం చేశారు.
28 Views