Bharat Aawaz
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో శనివారం నుంచి తిరుమల కొండపై భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు విస్తరించాయి. వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, నిన్న (శనివారం) ఒక్కరోజే 81,768 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వీరిలో 34,018 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.57 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ పేర్కొంది.
8 Views