బెంగళూరు నుంచే జగన్ డైరెక్షన్.. రాష్ట్రంలో గొడవలకు వైసీపీ కుట్ర: ఎస్వీఎస్ఎన్ వర్మ.
కూటమి ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదన్న టీడీపీ నేత
శాంతియుతంగా స్థానిక ఎన్నికలు.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వెల్లడి
పోలీసు అధికారిపై రోజా దాడి చేయడం దారుణమన్న ఎస్వీఎస్ఎన్ వర్మ
బీసీ రిజర్వేషన్లను సైతం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపణ
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే రాష్ట్రంలో గొడవలకు సూచనలు ఇస్తున్నారని, ఆయన ఆదేశాలతోనే కింది స్థాయి నాయకులు అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా, పారదర్శకంగా జరుగుతున్నా.. శాంతిభద్రతలు లోపించాయనే తప్పుడు ప్రచారానికి వైసీపీ తెరలేపిందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వర్మ అన్నారు. "గతంలో తమ పాలనలో నామినేషన్లు వేయకుండా బెదిరించడం, ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టి తప్పుడు కేసులు బనాయించడం వంటివి చేసిన చరిత్ర వైసీపీది. కానీ, మా ప్రభుత్వంలో అలాంటి బెదిరింపులకు తావులేదు.
ప్రజాస్వామ్య విలువలపై టీడీపీకి ఉన్న నమ్మకానికి మాచర్ల నియోజకవర్గమే నిదర్శనం. గతంలో అదే మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడులు జరిగాయి. కానీ, నేడు అదే ప్రాంతంలో వైసీపీ నేతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 36 నామినేషన్లు శాంతియుతంగా వేశారు. ఇదే మా సంస్కృతి" అని వర్మ వివరించారు.
46 Views