Bharat Aawaz
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, I.A.S. గారితో కలిసి ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు నందిపేట్ మండలంలోని లక్కంపల్లి SEZను సందర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతిరెడ్డి గారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్కంపల్లి SEZను ఆనుకుని ఉన్న ప్రాంతాలను పరిశీలించి, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలం, భవిష్యత్తులో రిఫైనరీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, స్థానిక రైతాంగానికి కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

రెండు జిల్లాల్లో ఇప్పటికే సుమారు 17 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగులో ఉందని, భవిష్యత్తులో మరో 5 వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో లక్కంపల్లి SEZ సమీపంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలతపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను సూచించారు.

స్థల నిర్ధారణ పూర్తయిన వెంటనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు.

రైతులు స్వచ్ఛందంగా ఆయిల్ పామ్ సాగు వైపు ముందుకు రావాలని సుదర్శన్ రెడ్డి కోరారు. రైతులకు అధిక ఆదాయం కల్పించడంతో పాటు, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.

వంట నూనెతో పాటు అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

లక్కంపల్లి SEZ ప్రాంతంలో రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనుకూలమైన స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వీటి ఏర్పాటుకు కృషి చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు.*

*అలాగే మధ్యప్రదేశ్‌లో సేంద్రియ విధానంలో చేపడుతున్న కూరగాయల సాగు పద్ధతులను అధ్యయనం చేసి, నందిపేట్ ప్రాంతంలో కూడా అదే తరహాలో కూరగాయల సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా, జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
269 Views